ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభలు
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్
సిద్దిపేట జనవరి 19,(TH9NEWS తెలంగాణ హెడ్ లైన్)
సిపిఎం పార్టీ నాల్గవ రాష్ట్ర మహాసభలు ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరగనున్నట్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ తెలిపారు. నాల్గవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చేపట్టిన జీపు జాత కార్యక్రమాన్ని ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జండా ఊపి ప్రారంభించారు. సిద్దిపేట పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించిన అనంతరం సిపిఎం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నాల్గవ రాష్ట్ర మహాసభలలో భాగంగా మొదటి రోజున బహిరంగ సభ ఉంటుందని ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, వివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం నాతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగే మహాసభల్లో కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు సాధించిన విజయాల గురించి చర్చిస్తామన్నారు. అలాగే రానున్న మూడు సంవత్సరాల కాలానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమగ్ర చర్చ జరిపి పలు తీర్మానాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక లోకానికి కర్షక లోకానికి ఇచ్చిన హామీల అమల్లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లారెడ్డి, గోపాలస్వామి, శశిధర్, రవి, నవీన పలువురు పాల్గొన్నారు.