సిద్దిపేట: ఫిబ్రవరి 13 (Th9NEWS, తెలంగాణ హెడ్ లైన్)
దివ్యాంగులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎన్నికల విధుల్లో నిలబడటం, బరువులు మోయడం, మారుమూల ప్రాంతాలకు ప్రయాణం చేయడం వంటి శారీరకంగా శ్రమతో కూడిన పనులు ఉంటాయి కనుక, చాలా మంది దివ్యాంగులు, వారి వైకల్యం యొక్క స్వభావం, పరిధిని బట్టి, ఈ పనులను చేయడం చాలా కష్టంగా ఉంటుదన్నారు. దివ్యాంగులకు ఎన్నికల విధులను కేటాయించడం ప్రతికూల ఫలితాలు వస్తాయని, విధులను సమర్ధవంతంగా నిర్వహించలేకతారన్నారు.భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం దివ్యాంగులు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సవాళ్లను పరిగణించాలని, సిద్దిపేట జిల్లాలో ఈ మార్గదర్శకాలు సమర్ధవంతంగా అమలు చేయాలని కోరారు. తమ విజ్ఞప్తిని పరిగణించి దివ్యాంగులకు ఎన్నికల విధి నుండి మినహాయింపు ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్, జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాస్,ప్రకాష్ గౌడ్, వేముల సత్యాన్వేష్ పాల్గొన్నారు.