–దుబ్బాక చేరుకున్న ప్రచార జాత
–25 ప్రజా ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయండి.
–సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్
దుబ్బాక:జనవరి19,(TH9 NEWS తెలంగాణ హెడ్ లైన్)
సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రచార జీపుజాత ప్రారంభించి దుబ్బాక చేరుకోవడం జరిగింది.ఈ సందర్భంగా దుబ్బాక లొ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏం నరసింహులు మాట్లాడుతూ ఉద్యమాల దిక్సూచి,పోరాటాల సారథి సిపిఎం పార్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడే సీపీఐ (ఎం) రాష్ట్ర 4వ మహాసభలు 2025 జనవరి 25-28 తేదీలలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా జనవరి 25న జరిగే భారీ ప్రదర్శన, బహిరంగసభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు కార్పొరేట్లు, బడాబాబులకే ఉపయోగపడుతున్నాయి తప్ప సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా లేవని,నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని.కార్మికులకు కనీస వేతనాలు అందడంలేదని రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని విమర్శించారు.విద్య, వైద్యం ప్రైవేటీకరణ, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు,బలహీన వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, పేదల కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం)ను బలపరచాలని అన్నారు.మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేవారికి వ్యతిరేకంగా పోరాడాలని, ఎర్రజెండా నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలని అన్నారు.రాజ్యాంగ హక్కులను కాలరాచేందుకు, రాష్ట్రాలను హక్కులను హరించేందుకు పూనుకుంటున్న బీజేపీ విధానాలను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు.రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువల కోసం పోరాడేందుకు సీపీఎం వామపక్ష ఉద్యమం బలపడాలని అన్నారు.అనంతరం సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం పరిధిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్యన అధికారం కోసం కొట్లాట తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నించడం లేదని విమర్శించారు.దుబ్బాక ప్రాంత అభివృద్ధి కొరకు ప్రభుత్వం నిధుల కేటాయించి అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు.తమ పదవుల కోసం పోరాటం తప్ప ప్రజా అభివృద్దికీ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే పోరాడుతుందని అన్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దుబ్బాక ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.జనవరి 25న జరిగే బహిరంగసభలో ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు అధిక సంక్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం దుబ్బాక మండల కార్యదర్శి నవీన ,దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్ మండల నాయకులు సాజిద్ ,బత్తుల రాజు, మెరుగు రాజు ,మల్లేశం ,లక్ష్మినర్సయ్య, సాదిక్ ,సంజీవ్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.